సుంకపు గుత్తదారుడైన జక్కయ్య యేసయ్య గురించి విన్నాడు, ఆయన బోధల గురించి, ఆయన రాజ్యము గురించి విన్నాడు, ఆయన తన పట్టణము గుండా వెళ్తున్నారని విని యేసయ్య ఎవరో చూడాలని ఆశపడి, తాను పొట్టివాడు కావడం వలన మేడి చెట్టు ఎక్కి యేసయ్య ఎవరో చూడాలని ఆశపడ్డాడు…. ఆ ఆశలో ఎలాంటి స్వార్ధపూరితమైన ఆలోచనలు లేవు, ఆ ఆశలో దేవుని రాజ్యములోనికి చేరాలి అనే ఆశ తప్ప మరేవిధమైన చెడు ఉద్దేశ్యం లేదు అందుకే చెట్టు ఎక్కితే అందరు ఏమనుకుంటారో, అందరు నన్ను చూసి నవ్వుతారేమో, హేళన చేస్తారేమో, సిగ్గుగా అనిపిస్తుందేమో అంటూ ఆలోచించలేదు…. హృదయపూర్వకముగా యేసును చూడాలి అని ఆశపడ్డాడు.
అందుకే అతని కోరికను తెలుసుకున్న యేసుక్రీస్తు ప్రభువువారు అతనిని గుర్తించి అతనిని పిలిచి, అతని ఇంటిలో ప్రవేశించెను…. యేసుక్రీస్తు ప్రభువు వారిని తన ఇంటికి చేరుకున్న వెంటనే జక్కయ్య హృదయము మారిపోయింది అందుకే తాను చేసిన అన్యాయమునకు ప్రతిగా ఒక్కొక్కరికి నాలుగింతలు ఇస్తానని చెప్పి తన ప్రతి తప్పును ఒప్పుకుని అబ్రాహాము కుమారుడుగా మార్చబడ్డాడు.
సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరోయని చూడగోరెనుగాని, పొట్టి వాడైనందున జనులు గుంపుకూడి యుండుట వలన చూడ లేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి, ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను.
యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచి జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా….
జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు ఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది – లూకా 19:1-9
అతనొక రాజు కానీ అందరివలె అతనుకూడా యేసుక్రీస్తు గురించి విన్నాడు…. ఆయనను ఒక్కసారైనా చూడాలని ఆశపడ్డాడు… అయితే ఒకానొక దినమున యేసుక్రీస్తు ప్రభువారిని అన్యాయముగా సిలువవేయాలని ప్రధాన యాజకులు, అధికారులు, ప్రజలందరూ గోలపెడుతుండగా ఆ సమయములో యేసుక్రీస్తు ప్రభువువారు గలిలయుడు గనుక రాజైన హేరోదు యెదుటికి ఆయనను తీసుకుని వచ్చారు. ఎప్పటి నుండో యేసయ్యను చూడాలనుకున్న హేరోదు సంతోషించి ఆయనను ఎన్నో ప్రశ్నలు వేసాడు అయితే వాటిలో ఒక్కదానికైనను యేసుక్రీస్తు ప్రభువువారు జవాబు ఇవ్వకపోవడముతో అందరితో కలిసి ఆయనను అపహాస్యం చెయ్యడం, తృణీకరించడం చేసాడు.
హేరోదు నేను యోహానును తల గొట్టించితిని గదా; యెవనిగూర్చి యిట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను – లూకా 9:9
హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయననుగూర్చి చాల సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి, బహుకాలమునుండి ఆయనను చూడగో రెను – లూకా 23:8
హేరోదు తన సైనికులతో కలిసి, ఆయనను తృణీకరించి అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరల పంపెను – లూకా 23:11
ఇక్కడ వీరు ఇరువురు కూడా యేసు ఎవరో చూడాలని మిక్కిలి ఆశపడ్డారు… కానీ ఒకరేమో భౌతికపరమైన ఆశతో, మరొకరేమో ఆధ్యాత్మికపరమైన ఆశతో చూడాలని అనుకున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు వారి ఎదుటకు వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కోవిధముగా ప్రవర్తించారు. భౌతికపరమైన ఆశను కలిగి ఉన్న హేరోదు నలుగురితో కలిసి యేసుక్రీస్తు ప్రభువు వారిని అపహాస్యం చేస్తే… ఆధ్యాత్మికపరమైన ఆశ కలిగి ఉన్న జక్కయ్య మాత్రం ఆయనను తన ఇంట చేర్చుకుని, తన బ్రతుకును మార్చుకున్నాడు.
మనలో ఇలాంటి వారు ఎందరో…. యేసు యొద్దకు వస్తే ఉద్యోగం వస్తుందని, పెళ్లి అవుతుందని, బిడ్డలు పుడతారని, అప్పులు తీరుతాయని ఇలా ఏవేవో భౌతికపరమైన ఆశలతో, ఆలోచనలతో వస్తారు…. వారు ఆశించినవి దక్కనప్పుడు మరింత కఠినముగా మారిపోయి అన్యులతో, నామకార్ధ క్రైస్తవులతో కలిసిపోయి క్రీస్తు నామమును అవమానపరుస్తూ ఉంటారు.
కానీ ఆధ్యాత్మికపరమైన ఆలోచనలు కలిగి ఉన్నవారు మాత్రం…. జక్కయ్యవలె మార్పు చెందుతారు. శ్రమలైనను, బాధలనను, ఇబ్బందులైనను, కష్టాలనైనను ఎదుర్కొంటు తమ హృదయమును పవిత్రముగా కాపాడుకుంటూ జీవిస్తారు.
ఇంతకీ ఇది చదువుతున్న నీవు ఎలాంటి వ్యక్తివి… హేరోదు వంటి వ్యక్తివా… లేక జక్కయ్యవలె మార్పు చెందిన వ్యక్తివా…
యేసును ఎందుకు ఆశ్రయిస్తున్నావు… యేసు యొద్దకు ఎందుకు వచ్చావు… నరకము నుండి పాపమునుండి తప్పించబడి పరలోకం చేరడానికా… నీ సొంత ఆలోచనలు కోరికలు తీర్చుకోవడానికా…
భౌతికపరంగా ఆలోచించిన హేరోదు రక్షణపొందలేదు కానీ ఆధ్యాత్మిక ఆకలి మరియు ఆసక్తి కలిగి ఉన్న జక్కయ్య మాత్రం మార్పు చెందాడు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాము కుమారుడు అయ్యాడు…. నీ ఆసక్తి, నీ తృష్ణ, నీ కోరిక, నీ ఆశ దేని గురించో ఒక్కసారి ఆలోచించు…. ఒకవేళ నీవు కూడా హేరోదు వలే కేవలం భూసంబంధమైన ఆలోచనలు, కోరికలతో నింపబడి భౌతికపరంగా ఆలోచిస్తున్నట్లైతే భక్తిహీనుల ఆశను దేవుడు భంగము చేసి నీతిమంతుల ఆశను తీర్చుతారని గ్రహించి (నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమై పోవును – సామెతలు 10:28) ఇప్పుడైనా మార్పు చెంది ఆధ్యాత్మిక ఆకలి, తృష్ణ, ఆశ కలిగి క్రీస్తుతో జీవిద్దాము. ఇట్టి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక.. ఆమెన్..