ఇంత దారుణమైన పరిస్థితులలోకూడా నీవు క్షేమంగా ఉండాలంటే నీవు ఏమి చేయాలి ? ప్రియమైన దేవుని ప్రజలారా మీ అందరికీ మా వందనములు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. (కీర్తనల గ్రంథము 91:1). సర్వశక్తుని నీడను విశ్రమించు వారి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత భద్రతగా ఉంటుందో కీర్తనలు 91వ అధ్యాయంలో మనకు తెలియపరుస్తుంది.
ప్రియమైన దేవుని ప్రజలారా ఈ రోజుల్లో భయంకరమైన పరిస్థితుల గుండా ప్రపంచం వెళుతుంది రోజులు గడిచే కొద్దీ పరిస్థితులు మారిపోతున్నాయి. రోజుకు ఒక న్యూస్ వింటున్నాము. పరిస్థితులు విపరీతంగా తారుమారు అవుతున్నాయి. 2020 వ సంవత్సరంలో మరి భయంకరమైన సంఘటనలను చూస్తున్నాము.
ఎన్ని తుఫానులు, ఎన్ని భూకంపాలు, ఎన్ని భారీ వర్షాలు, గ్యాస్ లీకేజీలు, మిడతల దండు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కరోనా వైరస్ ఒక ఎత్తు. ఎందుకు ఇంత ప్రాణ నష్టం జరుగుతుంది? ఎందుకు ఇంత ఆస్తి నష్టం జరుగుతుంది? పిల్లలు తల్లి తండ్రిని కోల్పోతున్నారు, తల్లిదండ్రిలు పిల్లలను కోల్పోతున్నారు, భార్య భర్తను కోల్పోతుంది, భర్త భార్యను కోల్పోతున్నాడు, ఎందుకు ఇంత ప్రాణ నష్టం జరుగుతుంది?
ఈ పరిస్థితి నుండి దేశాన్ని కాపాడేది ఎవరు? ఈ వైపరీత్యాల నుండి దేశాన్ని, ప్రజలను, ప్రపంచాన్ని దేవుడే కాపాడాలి. ఎందుకంటే పరిస్థితులు అంతా దారుణంగా ఉన్నాయి. భూమి మీద మానవ ఆవిర్భావం జరిగి కొన్ని వేల సంవత్సరములు అవుతున్న మనిషికి ఇప్పటికీ అంతుచిక్కనిది తన కళ్ళ ముందు ఉన్న ప్రకృతి నిర్మాణం. అలాగే ప్రకృతి వైపరీత్యాలు కూడా అంతుచిక్కని విధంగానే జరుగుతున్నాయి.
ఈరోజు పంచభూతాలు అనే పిలవబడుతున్న గాలి, నీరు, నింగి, నేల, నిప్పు ఇవన్నీ ప్రారంభంలో దేవుడు కలిగించినప్పుడు ఎంత చక్కగా ఉన్నయి మనకు తెలుసు. మనిషి భూమి మీద నివసించడానికి అనుకూలంగా ఉండాలని దేవుడు ప్రకృతిలో పంచభూతాలను సృష్టించాడు.
మనిషి, ప్రకృతికి రాజుగా ఉండాలనేదే దేవుని కోరిక. అందుకే మనిషి భూమి మీదకి వచ్చిన తొలి ఇల్లు ప్రకృతి ఎంతో అందంగా ఉండేది. అది జీవనోపాధిని కూడా కలిగించేది, ఆహారాన్ని ఇచ్చేది, దాహాన్ని తీర్చేది, వెలుగును ఇచ్చేది, నీడను ఇచ్చేది చాలా సహకారంగా ఉండేది. అప్పటిలో బాగున్నా ప్రకృతి ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయింది? మనిషి బ్రతకాలని దేవుడు ప్రకృతిని సృష్టిస్తే, ఇప్పుడు ఆ ప్రకృతి మనిషిని ఎందుకు చంపుతుంది?
ఇప్పటికీ అయినా నిజాన్ని గ్రహించండి, దేవుని పాద సన్నిధికి వచ్చి క్షమాపన పొందండి. దేవుని పిల్లలారా ప్రస్తుతం కలిగిన ఈ ఉప్పెనలు, ఈ శ్రమలు, ఉపద్రవాలు, విపత్తులు ప్రపంచమే కలవరపడుతున్నా ఈ విషమ పరిస్థితుల్లో నీవు సర్వశక్తుని నీడలో వి శ్రమించాలి. నీవు సర్వశక్తుని నీడను చేరుకుంటే నీకు ఎంతయినా క్షేమము అని ప్రకటిస్తున్నా…
ఇంత దారుణమైన పరిస్థితులలోకూడా నీవు క్షేమంగా ఉండాలంటే, ఇప్పటికైనా దేవుని పాద సన్నిధికి వచ్చి క్షమాపణ అడగండి. దేవుడు మీ ప్రార్థనలను అంగీకరించి మిమ్మలను క్షమించి కాపాడుతాడు, మీరు, మీ కుటుంబము క్షేమంగా ఉంటారు. దేవుడు మిమ్మును దీవించును గాక.