గొప్ప దేశానికి రాజు, ఎన్నో లక్షలమంది ప్రజల బాగోగులు, ఎటువైపు నుండి యుద్ధము వస్తుందో ఎలాంటి ప్రణాళికలో రూపొందించాలో, ఎలా రాజ్యాన్ని నిమ్మళముగా ఉంచాలో అనే ఆలోచనలు, భార్యలు, పిల్లలు వారి గురించిన బాధ్యతలు. ఇంతటి గొప్ప బాధ్యతాయుతమైన అధికారంలో ఉన్నప్పటికీ కూడా దావీదు దేవుని సన్నిధిలో గడుపుటకు తృష్ణ కలిగి ఉన్నాడు. అందుకే దేవునికి చెప్తున్నారు దేవా నేను వేకువనే నిన్ను వెదకుదును, రాత్రివేళలో సైతము లేచి నిన్ను స్తుతిస్తాను అని. దినమంతా నిన్ను ధ్యానిస్తాను అని.
దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును – కీర్తనలు 63:1
నా ప్రాణమా, మేలుకొనుము స్వరమండలమా సితారా, మేలుకొనుడి నేను వేకువనే లేచెదను – కీర్తనలు 57:8
యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచున్నాను – కీర్తనలు 119:55
న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రివేళ నేను మేల్కొనువాడను – కీర్తనలు 119:62
నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను – కీర్తనలు 119:97
మరి మన పరిస్థితి ఏమిటి, వేకువనే లేచి ప్రార్ధించే వారిగ, రాత్రివేళలో దేవుణ్ణి స్తుతించేవారిగా, దినమంతా దేవుణ్ణి ధ్యానించే వారిగా మనము ఉంటున్నామా, లేక మనకి సమయము దొరకడం లేదు అంటూ సాకులు చెప్తున్నామా.
ఒక ప్రముఖ సినిమా దర్శకుడు అంటున్నారు నేను ఉదయాన్నే లేచి అశ్లీల చిత్రాలను చూడకుండా నా దినాన్ని ప్రారంభించను అని.
మన దినాన్ని మనం దేనితో ప్రారంభిస్తున్నాము, లేవగానే న్యూస్ పేపర్ తోనా, వాట్సాప్, ఫేస్బుక్ తోనా మరి ఏ ఇతర లోకసంబంధమైన వాటితోనా లేక దేవుని వాక్యముతోనా?
మార్టిన్ లూథర్ గారు తన దినాన్ని ప్రార్ధనతో ప్రారంభించి, దేవునికి తన ఆత్మను అప్పగించి దినాన్ని ముగిస్తారు. మనం ఎలా మన దినాన్ని ముగిస్తున్నాము
దేవుడు మనకి ఇచ్చిన ఒక దినాన్ని లోకములో ఉన్న చెత్తతో ప్రారంభిస్తున్నామా లేక దేవునితో ప్రారంభిస్తున్నామా, దావీదు వలే దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుని గూర్చి ధ్యానించాలి అనే ఆశ, తృష్ణ మనలో ఉన్నాయా, దేవుడంటే అంత భయము, భక్తి, ప్రేమ, దేవుని సన్నిధిపట్ల ఆసక్తి మనకి ఉన్నాయా ఒకసారి పరీక్షించుకుందాము…
