సహజముగా ఒక వ్యక్తి మరణిస్తే ఆ దినం మన ఇంటిలో ఎంతో వేదనని, దుఃఖాన్ని నింపుతుంది, అది మనకి చెడ్డరోజులా అనిపిస్తుంది, బ్రతికినంతకాలం ఆ రోజుని మనం ఒక బ్లాక్ డే గానే చూస్తాము…
అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించిన రోజుని మాత్రం మంచి రోజు అని అంటూ అందరూ సంతోషిస్తారు, ప్రార్ధనలు జరుపుకుంటారు దానికి కారణం ఏమిటి…???? ఒక వ్యక్తి మరణ దినం ఎలా మంచి రోజు అవుతుంది…???? అదేవిధముగా ఎవరైనా ఒక వ్యక్తి మనకోసం శ్రమలు అనుభవిస్తే, ఇబ్బందులు పడితే ఎంతో బాధకలుగుతుంది కానీప్రభువైన యేసుక్రీస్తు వారు మనకోసం శ్రమలు అనుభవించడం వలన, గాయాలుపాలవడం వలన మనకి మేలు జరుగుతుంది కారణం ఏమిటి…????
ఎందుకు సాక్షత్తు దేవుని స్వరూపమైన యేసుక్రీస్తు వారే ఎందుకు ఇలాంటి త్యాగం చెయ్యాలి… ఆయన దేవుడు అని అందరు పూజిస్తారు, ఆరాధిస్తారు కదా మరి దేవుడైనప్పుడు ఆయనే ఎందుకు మరణించాలి…???
అనేకమంది మదిలో ఈ ప్రశ్నలు మెదలాడుతుంటాయి… అయితే కారణం ఏమిటి ఎందుకు అనేది ఈ శుభ శుక్రవారం రోజు తెలుసుకుందాము…
ఎందుకు మంచి రోజు అంటే పాపములచేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో పడి ఉన్న మనం మన పాపాలను పోగుట్టుకొనుటకు ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తూ పుణ్యస్నానాలు చేస్తూ, బలులు అర్పిస్తూ, హోమాలు, యాగాలు చేస్తూ, పుణ్యకార్యాల వలన స్వర్గం చేరాలి అని జీవిస్తూ నిజదేవుని కొరకు, నిజమైన శాంతికొరకు, ప్రేమ కొరకు, క్షమాపణ కొరకు, సమాధానం కొరకు ఈలోకంలో అల్లాడుతుంటే, అవేవి మనకు ఇట్టి నెమ్మదిని ఇవ్వలేకుండా ఉన్నప్పుడు ఎలాంటి బలులు, అర్పణలు చెయ్యాల్సిన అవసరం లేకుండానే మన హృదయాన్ని శుద్ధి చేయుటకు, మన అపరాధములను క్షమించుటకు, మనల్ని నీతిమంతులను, పరిశుద్దులుగా చేయుటకు మనం నిమిత్తం మనం చేసిన పాపము నిమిత్తం, మనపై ఉన్న శాపము నిమిత్తం పరిశుద్ధుడు, పవిత్రుడైన మహిమాన్వితుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు పాపముగా చేయబడి మనకి రావాల్సిన శిక్షను సిలువపై తాను అనుభవించి మనల్ని తప్పించారు, ఆయనయందు విశ్వసించుట ద్వారా తన రక్తముతో మనల్ని కడిగి పరిశుద్దులుగా, నీతిమంతులుగా చేసారు అందుకే మన రక్షకుని మరణ దినం, శ్రమపడిన దినం, వేదనపాలైన దినం మనకు శుభ శుక్రవారం.
ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను – 2కోరింథీ 5:21
ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను – 1తిమోతికి 2:6
ఏలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు – రోమా 4:7
మనం అర్పించే బలులు మనల్ని శుద్ధీకరించలేకపోయాయి “ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము – హెబ్రీయులకు 10:4” గనుకనే మన నిమిత్తం ఒక్కసారే తానే అర్పించబడుటచేత తన రక్తముద్వారా మనలను శుద్ధీకరించి సంపూర్ణులుగా చేసారు “యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము. ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకముచేసికొనను అని ప్రభువు చెప్పుచున్నాడు – హెబ్రీయులకు 10:10-17”
నీ, నా నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించబడ్డారు, ముండ్ల కిరీటమును ధరించారు, ఉమ్మివేయబడ్డారు, అపహసించబడ్డారు, నలుగగొట్టబడ్డారు… మనం తండ్రి చెయ్యి పట్టుకొనుటకు తానే తండ్రిచేత విడువబడ్డారు… అయితే ఇట్టి త్యాగాన్ని నీవు గుర్తించావా???? దేవుని ప్రేమను నీవు అర్ధం చేసుకున్నావా???? ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించావా????? క్రీస్తు రక్తములో కడగబడిన నీవు తిరిగి వెళ్లి లోకములో, పాపములో పడిపోకుండా జాగ్రత్తగా నీ రక్షణను కాపాడుకుంటున్నావా???? రక్షించబడిన నీవు ఇంకా రక్షణపొందని వారి నిమిత్తమై భారముకలిగి ప్రార్ధిస్తున్నావా???? ఒక్కసారి ఆలోచించు… పరీక్షించుకో.. సరిచేసుకో…