జాగ్రత్తపడుతున్నావా

జాగ్రత్తపడుతున్నావా


ముందు జరిగినదే ఇప్పుడును జరుగును; జరుగబోవునది పూర్వమందు జరిగినదే; జరిగిపోయినదానిని దేవుడు మరల రప్పించును – ప్రసంగి 3:15

ఈ వాక్యం చదివినప్పుడు సహజముగా మనకందరికి అనిపిస్తుంది అవును… చావు పుట్టుకలు, మానవ జాతి మనుగడ ఇవన్నీ ముందు ఉన్నవే, ఇప్పుడు కూడా జరుగుతున్నవే ఇక మీదట కూడా జరిగేవే కదా… మానవ జాతి ఒక యాంత్రికమైనటువంటి ప్రయాణమే కదా అంటూ ఆలోచిస్తుంటారు… కానీ ఆధ్యాత్మిక కోణములో చూసినట్లయితే మనలో ఉన్నటువంటి లేదా మనం సరిచేసుకోవాల్సినటువంటి గూఢమైన విషయాలు మన ఆత్మకు మేలు కలుగజేసే విషయాలు ఎన్నో దేవుడు మనకు తెలియజేస్తారు..

సిద్ధపాటు విషయములో – మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈలోకమునకు వస్తారని దేవుడు ఎంతో మంది ప్రవక్తల ద్వారా, ప్రవచనాల ద్వారా, దర్శనములు ద్వారా యూదులకు తెలియజేసారు… వారందరు నేటికీ కూడా మెస్సయ్య నిమిత్తం ఎదురుచూస్తునే ఉన్నారు కానీ మెస్సయ్య వచ్చినప్పుడు ఆయనను గుర్తించలేదు, అంగీకరించలేదు. కానీ తూర్పు దేశపు జ్ఞానులు మాత్రం యూదులు రాజుగా పుట్టిన వారు ఎక్కడ అంటూ వెతుకుంటూ వచ్చారు (మత్తయి 2:2-5, యోహాను 1:11)

అదేవిధముగా నేడు భూమిపై ఉన్న ప్రతి వ్యక్తికి ఈ భూమి అంతం కాబోతుందని అలాగే డినామినేషన్ తో పని లేకుండా ప్రతి క్రైస్తవునికి తెలుసు… ప్రతి ఒక్కరు దేవుని రాకడ అతి త్వరలో అని అంటారు కానీ ఆ రాకడలో ప్రభువుతో పాటు కొనిపబడాలని, పరలోకం చేరాలని సిద్దపడే వారు మాత్రం అరుదుగా ఉంటున్నారు… (2పేతురు 3:9-12)

సిద్దాంతాలు, ఆచార సంప్రదాయాలు – మానవులు వివిధరకముల తంత్రములు కల్పించుకుని, ఏవేవో ఆచారాలు, సంప్రదాయాలు ఏర్పాటు చేసుకున్నారు.. అది అన్యజనులు అని, యూదులు అని లేదు కానీ అనేకరకములైన ఆచారాలను పాటిస్తూ ఉంటారు. (మార్కు 7:3-9)

జాగ్రత్తపడుతున్నావా:

అయితే రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా నేటికీ అనగా ఆ అజ్ఞాన కాలములో చేసిన ఆచారములనే పాటిస్తూ పైగా మేము క్రైస్తవులమండి అంటూ మాట్లాడుతూ ఉంటారు… మనుష్యుల పారంపచారములను, మంచి రోజు చెడ్డ రోజుల అంటూ, అమావాస్య, పండుగ దినములు, చావు దినములు, అనేకరకములైన శుభకార్యములు అంటూ నేటికీ కూడా ఆచరిస్తూనే ఉంటున్నారు. (కొలస్సీ 2:8,16,21)

అలంకరణ మరియు వేషధారణ విషయములో – ఆనాటి జనులు ఎక్కువ అలంకరణ చేసుకుంటూ, దైవ భక్తి లేని వారై జీవిస్తూ ఉంటున్నారు.. అందుకే ప్రభువు వారితో “వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోప దేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే – మార్కు 7:7” అని అంటున్నారు…

అయితే నేటికీ కూడా ఇట్టి వేషధారణ కలిగిన వ్యక్తులు ఎందరో…. మానవులు కల్పించిన పద్దతులను అనుసరిస్తూ, దడినామినేషన్ కి ఒక పద్ధతి, ఆచారం ఉంటుంది, అలాగే అలంకరణ విషయములో ముఖమునకు రంగులు పులుపుముకుంటూ, విచిత్రమైన వస్త్రధారణ కలిగి జీవిస్తూ మేము క్రైస్తవులము అంటూ మందిరానికి వస్తుంటారు… ఆరాధన చేస్తుంటారు… అయితే ఇలాంటి వారందరిని కూడా ప్రభువు వేషధారులు అనే అంటున్నారు… (1 తిమోతికి 2:9,10)

ప్రేమ మరియు పరిశుద్ధత విషయములో – ఎఫెసీ సంఘము రక్షించబడిన తొలిదినాల్లో ఎంతో భక్తిని దేవుడంటే ఎంతో ప్రేమను కనపరిచారు.. అయితే కాలక్రమేణా వారు ఆ ప్రేమను విడిచిపెట్టారు.. (ప్రకటన 2:4, అదేవిధముగా గలతి సంఘమువారు మొదట ఆత్మనుసారముగా ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించి అటుపిమ్మట శరీరానుసారముగా జీవించడం మొదలుపెట్టారు (గలతి 3:1,3).

నేటి దినములలో ఇలాంటి వారు ఎందరో, దేవుడంటే ఉన్న ప్రేమను మరచిన వారు (మత్తయి 24:12), దేవుణ్ణి విడిచిపెట్టి లోకములో కలిసిపోయిన వారు, విశ్వాసమును (హెబ్రీ 3:12) పరిశుద్దతను కాపాడుకోలేక పడిపోతున్న వారు ఎందరో…

జాగ్రత్తపడుతున్నావా: అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది “మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు – మత్తయి 19:30” మరి ఇంతకీ మనం ఎవరిమి????? మొదటి వారిమా, కడపటి వారము అయ్యామా లేక కడపటి వారము మొదటి వారము అయ్యామా…. దేవుని రాకడకు సిద్దపడే విషయములో, ప్రేమ పవిత్రలో, విశ్వాసములో, ఆచార సంప్రదాయములు పాటించకుండా, లోకములో పడిపోకుండా మనల్ని
మనం జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా లేక మొదట మనకుండిన ప్రేమను, విశ్వాసమును కోల్పోయి లోకములో కలిసిపోయామా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుని సరిచేసుకుందాము. ఇట్టి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక.. ఆమేన్.

1 thought on “జాగ్రత్తపడుతున్నావా”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *