నీదేవుని బలమును_ఆశ్రయిస్తున్నావా?
ఒకరోజు ఒక బాబు ఇసుకులో తన బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. ఇసుకలోనే ఇల్లు కట్టడం, రోడ్డు వేయడం చేస్తుంటాడు. అలా రోడ్డు వేయడానికి ఇసుకను సరిచేస్తూ ఉండగా బాబుకి అడ్డుగా ఒకపెద్ద రాయి వస్తుంది. దాన్ని తీసివెయ్యటానికి ప్రయత్నిస్తాడు. ఇసుకని త్రవ్వుతూ ఉంటాడు. అది చాల పెద్దరాయి కావడముతో ఎంతగా దాన్ని నెట్టినప్పటికీ అది కొంచెము కూడా కదలదు. ఎంత బలముగా తాను దాన్ని కదిలించటానికి ప్రయత్నిస్తే అంత బలముగా బాబు వెనక్కి వచ్చేస్తుంటాడు.
తన ప్రయత్నం విఫలము కావడముతో నిరాశకు గురి అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇదంతా దూరము నుండి తన తండ్రి కిటికిలోనుండి గమనించి బాబు దగ్గరకి వస్తాడు. అప్పుడు బాబు ఈ రాయిని తీయడానికి ప్రయత్నిస్తుంటే ఇది రావడం లేదు నాన్న అని చెప్తాడు. నువ్వు నీ శక్తిని అంతటిని ఉపయోగించి తీయడంలేదు అని తండ్రి చెప్పగా. లేదు నేను చాల బలముగా నా శక్తి అంతటిని ఉపయోగించి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇది రావడం లేదు అని చెప్తాడు. నీ శక్తి చాలనప్పుడు నీకు బలమును చేకూర్చగల నీ తండ్రిని నీవు ఆశ్రయించాలి. నిన్ను బలపరచే నీ తండ్రి ద్వారా నీవు ఏదైనా చేయగలవు అని చెప్తాడు. ఆ బాబు తండ్రి సహాయముతో అడ్డుగా ఉన్న రాయిని తొలగించగా తిరిగి తన ఆటలో సంతోషముతో నిమగ్నం అయిపోతాడు…
నేడు ఆ బాబు లాంటి వారు అనేకులు ఉంటున్నారు…. తాము కలిగి ఉన్న సమస్యను పరిష్కరించుటకు, జయించుటకు తనకు శక్తి చాలదని తెలిసినప్పటికీ కూడా ఒంటరిగా పోరాటం చేస్తూనే ఉంటారు, తమ బలమును, జ్ఞానమును నమ్ముకుని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు… అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది “యెహోవాను ఆశ్రయించుడి ఆయన బలము నాశ్రయించుడి ఆయన సన్నిధి నిత్యము వెదకుడి – 1దినవృత్తాంతములు 16:11”
అవును మన బలమును, మన జ్ఞానమును మనుష్యులను కాకుండా దేవుణ్ణి ఆశ్రయించాలి, ఆయన బలమును ఆశ్రయించాలి, ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములను చేస్తుంది,మనం ఊహించలేని భీకర కార్యాలను చేస్తుంది, ఆయన కార్యము చెయ్యగా త్రిప్పివేయు వారు ఎవరు లేరు గనుక మన బలమును ఆశ్రయించకుండా, సమస్యలకి పరిష్కారం నిమిత్తం ఆయన సన్నిధిని వెదకకుండా సమయాన్ని వృధా చేస్తూ, శక్తిని కోల్పోతూ వ్యర్థముగా ప్రయాసపడకుండా బాబు వలే దేవుని శక్తిని, దేవుని బలమును ఆశ్రయించి దేవుని సన్నిధిలో కనిపెట్టేవారిగా ఉందాము… ఇట్టి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక.. ఆమేన్..